Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

బిజెపితో టిడిపి విడాకులు ఖాయం…!

Published on Nov 14 2017 // Politics

‘కాలు తొక్కిన నాడే తెలిసింది…కాపురం చేసే కళ..’ అన్నట్లు బిజెపి తమతో వ్యవహరిస్తున్న తీరుతో విసుగు చెందిన టిడిపి ఇక ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధమవుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కలసిపోటీ చేసి విజయం సాధించిన వీరు ఇక నేడో రేపో విడిపోవడం ఖాయమని తేలిపోయింది.

తమను అనుక్షణం అవమానిస్తూ, బెదిరిస్తూ, అరాచకంగా వ్యవహరిస్తున్నా..ఇప్పటి వరకు పంటిబిగువన భరించిన టిడిపి అధినాయకత్వం ఇక తాము భరించలేమని, బిజెపితో విడాకులు తీసుకోవడం ఖాయమనే సంగతిని పార్టీ శ్రేణులకు తెలియచెబుతోంది.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేరకపోయినా…ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నా..తమపై అనుమానంతో నిత్యం వేధిస్తున్న బిజెపి అగ్రనేతలకు సరైన సమయంలో గుణపాఠం నేర్పడానికి టిడిపి అధ్యక్షుడు మానసికంగా సిద్ధమయ్యారని ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఉన్న బిజెపి అగ్రనేతలకు బంధాలను గౌరవించడం తెలియదని, రాజ్యాంగ కాంక్షతో నమ్మకస్తులైన స్నేహితులను వదిలేసుకుంటున్నారని ‘చంద్రబాబు’ భావిస్తున్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా..తాము ఎప్పుడూ బెదిరించలేదని, తనపై, రాష్ట్రంపై విష ప్రచారం చేస్తున్నా భరించామని, తమ శత్రువులతో అక్రమ బంధం పెట్టుకున్నా సహించామని, ఇప్పుడు పార్టీని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని…దీన్ని ఇక ఇప్పుడు భరించే పరిస్థితి లేదని ఆయన అంటున్నారట.

అడుగడుగునా..అవమానాలు….!

2014 ఎన్నికల్లో ఘనవిజం సాధించిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడుగడుగునా అవమానించింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయకుండా ఒక వైపు వేధిస్తూనే..మరో వైపు ఇచ్చిన హామీలను మర్చిపోయింది.

రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల విషయంలో ఒక్క హామీని నెరవేర్చని బిజెపి ప్రభుత్వం…కిందా మీదా పడి నెట్టుకొస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును అడుగడుగునా అవమానిస్తోంది. ఆయన తాము ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని పరోక్షంగా విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంపై ఈ రకమైన దాడి ఇంతకు ముందు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు.

రాష్ట్రంలో భాగస్వామిగా ఉంటున్న పార్టీ…ఇక్కడ ప్రజలకు మేలు చేసే చర్యలు చేయకపోగా…అడగడుగునా అవమానించింది. ఎంత సర్దుకుపోతున్నా..ఏదో రకంగా వేధించడమే లక్ష్యంగా చేసుకుని కువిమర్శలకు పాల్పడుతోంది. టిడిపితో పొత్తు కొనసాగిస్తూనే…టిడిపికి శత్రువు, అవినీతిపరుడైన వై.ఎస్‌.జగన్‌ను ప్రోత్సహిస్తోంది.

అనేక అవినీతి కేసుల్లో నిందితుడైన ‘జగన్‌’ను ప్రధాని మోడీ పదే పదే కలుస్తూ…తాము ఆయనకు వ్యతిరేకం కాదని, అవసరమైతే…వైకాపాతో పొత్తు పెట్టుకుంటామనే సంకేతాలు ఇచ్చి..టిడిపిని అవమానించారు. నిన్న మొన్నటి దాకా..ఇదే వరుసలో ఉన్న బిజెపి పెద్దలు..ఇటీవల మారిన పరిస్థితుల నేపథ్యంలో కొంత తగ్గి ఉంటూనే వేధింపులు మాత్రం కొనసాగిస్తున్నారు.

ఇచ్చిన హామీలను విస్మరించారు..!

ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ఢిల్లీని మించిన రాజదాని నిర్మాస్తామని హామీ ఇస్తే..నిజమేనని భ్రమపడ్డారు..ఆంధ్రాజనం…! రాజధాని నిర్మాణానికి ఆహ్వానిస్తే..వచ్చి పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చిన ‘మోడీ’ని చూసి అవాక్కు అయ్యారు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదు..సరి కదా..స్వచ్చంధంగా భూములు ఇచ్చిన రైతులను వేధిస్తూ రాజధాని నిర్మాణాన్ని ఆలస్యం చేస్తున్నారు.

ప్రత్యేకహోదా విషయంలో మెలికలు పెట్టి…ప్రత్యేక ప్యాకేజీ అంటూ బూటకపు కబుర్లు చెప్పారు..దానిపై ఇంత వరకూ నోరెత్తలేదు…! రైల్వేజోన్‌ విషయమూ అంతే..ఇస్తామన్న జోన్‌ ఇవ్వకుండా మీన మేషాలు లెక్కిస్తున్నారు…ఉమ్మడి ఆస్తుల పంపకం విషయంలో తెలంగాణ వైపు ఉంటూ ఆంధ్రాకు అన్యాయం చేశారు..!

పంచాల్సిన ఉమ్మడి ఆస్తుల విలువ దాదాపు 70 వేల కోట్లు ఉన్నా వాటిని గురించి పట్టించుకోవడం లేదు..! వెనుకబడిన ప్రాంతాలకు నిధుల కేటాయింపు విషయంలోనూ అన్యాయమే…చట్టంలో వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని చెబితే..దాని ఊసు పట్టించుకోలేదు. రెవిన్యూలోటు విషయంలో నిత్యం అవమానాలే…రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలు ఆడుతుందని ఆరోపిస్తూ కాలం వెలుబుచ్చుతున్నారు.

వెంకయ్యపై వేటేశారు…!

ఆంధ్రాకు కాస్తాకూస్తో న్యాయం చేస్తున్న ‘వెంకయ్యనాయుడు’పై వేటేశారు…! తనకు ఉపరాష్ట్రపతి పదవి వద్దు మొర్రో..అంటున్నా వినకుండా..ఆయనను పదవి నుంచి తొలగించి ఆంధ్రుల మనస్సు గాయపరిచారు.

ఆయన మంత్రిగా ఉంటే…ఆయనకు సంబంధించిన శాఖల నుండైనా నిధులు వచ్చేవి…ఆయన స్వతంత్రించి ఆంధ్రా విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారని భావించి ఆయన లబలబలాడినా, కన్నీళ్లు పెట్టుకున్నా కనికరించకుండా ఆయన పదవిని ఊడబెరికి పరోక్షంగా ఆంధ్రాకు అన్యాయం చేశారు…!

పోలవరం, డిజిపి వ్యవహారంలోనూ అంతే!

గత మూడేళ్ల సంగతులను వదిలేస్తే తాజాగా బిజెపి రాష్ట్రానికి సంబందించిన వ్యవహారంలో వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ వైఖరికి అద్దం పడుతోంది. ఆంధ్రాకు జీవనాడి అయిన ‘పోలవరం’ ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదంగా ఉంది.

జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి నిధులు ఇవ్వాల్సిన కేంద్రం…నిధులు ఇవ్వకుండా ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను ఇవ్వమన్నా ఇవ్వకుండా మొండికేస్తోంది.

ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన పునరావాస చర్యల కింద ఖర్చుచేసిన నిధులను తాము ఇవ్వమని, ఇది ప్రాజెక్టు నిర్మాణంలో భాగం కాదని చెప్పడం ఆ పార్టీ కుత్సికబుద్దికి నిదర్శనం. ఏ ప్రాజెక్టు నిర్మాణంలోనైనా..పునరావాస చర్యల కింద ఖర్చు చేసే నిధులను ప్రాజెక్టు వ్యయంలో కలుపుతారు..ఇది ఆది నుంచీ ఉన్నదే..కానీ..ఇక్కడ మాత్రం బిజెపి పెద్దలు మాత్రం తిరకాసుగా మాట్లాడుతున్నారు.

పోనీ..ఏదోలే అని సరిపెట్టుకుంటే..తాజాగా కాంట్రాక్టర్‌ విషయంలోనూ ఇక్కట్లకు గురి చేస్తున్నారు. ప్రధాన గుత్తేదారు…ప్రాజెక్టు నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయటం లేదని..కాంట్రాక్టర్‌ను తప్పిస్తామని చెబితే కుదరదంటే కుదరని నిక్కచ్చిగా చెప్పింది…! అదే సమయంలో నిధులు ఇవ్వండీ..ఏదో రకంగా కాంట్రాక్టర్‌ చేత పనిచేయించుకుంటాం.

.అంటే నిధులు లేవని సమాధానం ఇస్తుంది…! మరి సకాలంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేదెప్పుడు…? ఈ వివాదాలు ఇలా ఉంటే ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన కాఫర్‌డ్యామ్‌ నిర్మాణాన్ని చేపట్టవద్దని మళ్లీ కాలు అడ్డం పెడుతోంది. ఏదైనా సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో కాఫర్‌డ్యామ్‌ నిర్మాణమే కీలకం.

అటువంటి కాఫర్‌డ్యామ్‌ నిర్మాణం చేయకుండా ప్రధాన ప్రాజెక్టును నిర్మిద్దామని కల్లబొల్లి కబుర్లు చెబుతూ ప్రాజెక్టు పనులు జరగకుండా అడ్డం పడుతోంది. ఒక వైపు నిధులు ఇవ్వరు…మరో వైపు అనుమతులు ఇవ్వరు..ఇంకో వైపు కొర్రీలు వేసుకుంటూ నిర్మాణానికి అడ్డుపుల్లలు వేస్తారు..ఇలా వేధిస్తే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేదెప్పుడు..? సకాలంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడం ఇష్టం లేకే బిజెపి ఇలా వ్యవహరిస్తుందనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌ శాశ్విత డీజీపీ నియామకం విషయంలో కేంద్ర వ్యవహరిస్తున్న తీరు కూడా అభ్యంతరకరంగా ఉంది. తాము పంపిన లిస్ట్‌ను తిప్పి పంపి…డీజీపీ ఎంపికలో వేలు పెట్టింది బిజెపి ప్రభుత్వం. దీనిపై తీవ్రంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మళ్లీ అదే లిస్ట్‌ను కేంద్రానికి పంపి తమ వైఖరిని స్పష్టం చేసింది.

మరి దీనిపై ఏమి చేస్తారో చూడాల్సి ఉంది. మిత్రపక్షంగా ఉంటూనే నిత్యం గోతులు తీస్తున్న బిజెపి వ్యవహరానికి తాజా నిదర్శనాలు ఈ ఉదంతాలు..! ఎన్ని అవమానాలు, ఆంక్షలు పెట్టినా..ఏదో రకంగా
సర్దుకుపోతున్నా..సర్దుకుపోలేని పరిస్థితి తీసుకువచ్చారు బిజెపి పెద్దలు…తాజాగా పోలవరం, డిజిపి వ్యవహారంతో వారి వెకిలి చేష్టలు పరాకాష్టకు చేరాయని రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఆంధ్రా జనం కూడా భావిస్తున్నారు.

ఇక వారి ఆటలు సాగనిచ్చేది లేదని..వారితో కటీఫ్‌కు సిద్దం కావాల్సిందేనని వీరు భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మారిన పరిస్థితులతో ఇప్పుడు కొంచెం తగ్గి ఉంటున్నా…ఇక వారిని నమ్మేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారు.

వారితో కొనసాగలేని పరిస్థితి ఉందని..వారిని వదిలించుకోవడమే మంచిందని భావిస్తున్న ఆయనకు ఆంధ్రా ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని,మిత్ర బంధాన్ని కట్టుబడని బిజెపిని మార్చిలోపే ఆయన వదిలించుకుంటారని ఆయనకు సన్నిహితులైన వ్యక్తులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం…!

Leave a comment