Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

దక్షిణాదిలో చ‌తికిల ప‌డుతున్న‌ ‘బిజెపి’…!

Published on Nov 14 2017 // Politics

ఆరు నెలల క్రితం దాకా…దక్షిణభారతదేశంలో ‘బిజెపి’ పార్టీ దూసుకుపోతుందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేరు మోసిన జాతీయస్థాయి జర్నలిస్టులు వ్యాఖ్యానించేవారు..చర్చల్లో వాదించేవారు.

ముఖ్యంగా కర్ణాటక,ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాల్లో స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళలో ప్రభుత్వాల ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ఆ పార్టీ సహకారం లేకుండా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని వారు అంటుంటేవారు. దాన్ని మెజార్టీ ప్రజలు, నాయకులు కూడా అంగీకరించేవారు.

ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ సాధించిన ఘనవిజయంతో కొందరికి అనుమానాలున్నా వారి వాదనను అయిష్టంగానే అంగీకరించేవారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఉత్తరాదిలో గతంలో తాము గెలిచిన కొన్ని సీట్లు కోల్పోయినా..దక్షిణాదిలో వచ్చే సీట్లతో స్వంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి నేతలు ఠంకా బజాయించి చెప్పేవారు.

అయితే అంతా అనుకున్నట్లు జరగదు కదా…! ఆరు నెలల్లో అంచనాలు తలకిందులయ్యాయి. దీనికి ప్రధాని మోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాలు వ్యవహరించిన తీరే కారణం. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా తమ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పరచాలన్న వీరి అత్యాశ వారి కొంప ముంచబోతోంది.

ప్రస్తుతం జరుగుతున్న హిమాచలప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికల్లో బిజెపి పరాజయం పాలయితే..రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించడం కష్టం. దీంతో ఇప్పటికే వేగంగా పతనమవుతున్న బిజెపి దక్షిణాదిలో పూర్తిస్థాయిలో ఉనికి కోల్పోవడం ఖాయం.

దక్షిణాదికి చెందిన పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ వ్యవహరించిన తీరుతో ఇక్కడి ప్రజలు వారికి దూరం జరుగుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ, కేరళలలో ఆ పార్టీ నేతలు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. దీనిపై వివరంగా చర్చించుకుందాం…!

ఆంధ్రప్రదేశ్‌ను బిజెపి ప్రభుత్వం నమ్మించి గొంతు కోసిందన్న అభిప్రాయం ఆ రాష్ట్ర ప్రజల నుంచి సర్వత్రా వ్యక్తం అవుతోంది. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌తో పాటు బిజెపి భాగం పంచుకున్నా…నాడు ‘మోడీ’ ఇచ్చిన హామీలను నమ్మి ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించారు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు. తిరుపతిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ‘తిరుమల వెంకన్న’ సాక్షిగా మాట్లాడుతూ..కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందని, తాను ప్రధానమంత్రిని అయితే రాష్ట్రానికి మేలు చేస్తానని హామీ ఇచ్చిన ‘మోడీ’ ఆ హామీలను తుంగలో తొక్కారు.

సరికదా..కిందామీదా పడి నెట్టుకువస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అడ్డుపుల్లలు వేస్తున్నారనే అభిప్రాయం సగటు ఓటర్లల్లో నెలకొని ఉంది. ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌, వెనుకబడిన ప్రాంతాలకు నిధుల కేటాయింపు, రాజధాని నిర్మాణానికి నిధులు, ప్రత్యేకప్యాకేజీ, పోలవరం నిర్మాణం, కేంద్ర సంస్థల ఏర్పాటు, ఉమ్మడి ఆస్తుల పంపకంలో నిరాసక్తతతో బిజెపి పెద్దలు వ్యవహరిస్తున్నారు.

ఎన్నికల సమయంలో చెప్పిందేమిటీ..ఇప్పుడు చేస్తున్నదేమిటన్న దానిపై రాష్ట్ర ప్రజలు ప్రతి రోజూ చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌ కన్నా బిజెపినే ఎక్కువ ద్రోహం చేసిందన్న భావన వారిలో నిరంతరం వ్యక్తం అవుతూనే ఉంది. అంతే కాకుండా అధికార టిడిపితో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌తో చేస్తోన్న స్నేహాన్ని కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

ఇదే సమయంలో రాష్ట్రానికి పెద్దదిక్కుగా ఉన్న ‘వెంకయ్యనాయుడు’కు చేసిన అవమానం ప్రతి ఆంధ్రుడిని తొలిచేస్తోంది. ఢిల్లీ స్థాయిలో ఆంధ్రాకు అండగా ఉన్న ఆయన రాష్ట్రానికి సహాయం చేస్తున్నారన్న నెపంతో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించి ఉపరాష్ట్రపతిపై కూర్చుండబెట్టిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పదే పదే అవమానిస్తూ…తమ నైజాన్ని చాటుకున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా…అడ్డుపుల్లలు వేస్తుండడంతో..ఇప్పుడు ఆంధ్రాలో ‘మోడీ’ అన్నా..’బిజెపి’ అన్నా ఇక్కడి ప్రజలు ఆగ్రావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా, టిడిపితో కానీ, వైకాపాతో కానీ పొత్తు పెట్టుకున్నా..వారిని ఘోరాతి ఘోరంగా ఓడించడం ఖాయం.

తమిళనాడులో ఆ పార్టీ వ్యవహరించిన తీరు కూడా తీవ్ర వివాదాస్పదం అయింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత హాస్పటల్‌లో ఉన్నప్పుడు ఆమెకు ఏ విధమైన వైద్యం జరుగుతుందో తెలపకుండా…ఆమె మరణించే దాకా రహస్యంగా వ్యవహరించడం ఆ రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ‘జయ’ మరణంపై కేంద్రం నివేదిక విడుదల చేయాల్సి ఉన్నా..ఆమె మరణాన్ని తమ రాజకీయ ఎదుగుదలకు వాడుకోవాలన్న కుత్సిక బుద్దిని గ్రహించిన తమిళులు వారికి బుద్ది చెప్పడానికి సిద్ధం అవుతున్నారు.

అన్నాడిఎంకెలోని రెండు వర్గాలతో ఆడుకుంటూ రాష్ట్రాన్ని తిరోగమన దిశలో పయనింప చేసిన బిజెపి పెద్దల దాష్టికం..వారి కపటబుద్దిపై ఇప్పుడు వారు మండిపడుతున్నారు. అన్నదాతలను ఆదుకోవాలని ఢిల్లీలో తమిళ రైతులు పలుసార్లు తీవ్రస్థాయిలో నిరసన లు వ్యక్తం చేసినా పట్టించుకోని ‘మోడీ’ అండ్‌ కో… తాజాగా ఆ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకుంటుందని భావిస్తోన్న డిఎంకెతో జతకట్టాలని ఆరాటపడడంపైనా వారు స్పందిస్తున్నారు.

నిన్నటి దాకా ‘అన్నాడిఎంకె’ నేడు డిఎంకెతో వీరు ఆడుతున్న నాటకాలను రాష్ట్ర ఓటర్లు గ్రహిస్తున్నారు. ఏదో విధంగా తమిళనాడులో పాగా వేయాలని బిజెపి వేస్తోన్న ఎత్తులను చిత్తు చేయడానికి తంబీలు సిద్ధం అవుతున్నారు.

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తామే అధికారంలోకి వస్తామని బల్లగుద్ది వాదించి ఇక్కడ బొక్కబోర్లా పడ్డారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకుని ఐదు అసెంబ్లీ సీట్లు గెలిచిన బిజెపి ఆ బలం అంతా తనదేనని, టిడిపి పార్టీని దెబ్బ కొడితే ఆపార్టీ ఓట్లన్నీ తనకే బదిలీ అవుతాయని, కాంగ్రెస్‌కు చెందిన మరి కొంత మంది నాయకులను ఆకర్షిస్తే..ఇక రాష్ట్రం తమదేనని ఊహలపల్లకిలో ఊరేగారు.

వాస్తవాలను మరిచి టిడిపితో పొత్తు లేదని ఒంటరి పోరాటమేనని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా తమకు వ్యతిరేకంగా ఉన్న సంగతిని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. టిడిపితో పొత్తు ఉంటుందని, ఆ పార్టీకి చెందిన ‘రేవంత్‌రెడ్డి’ కాంగ్రెస్‌లో చేరినప్పుడు ప్రకటించడమే వారి బలహీనతకు నిదర్శనం.

అంతే కాకుండా వివాదరహితుడు అయిన సికింద్రాబాద్‌ ఎంపి బండారు దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి తొలగించి ఆయనను ఘోరంగా అవమానించారు. దత్తన్నకు జరిగిన అవమానంపై బిసిలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలమైన టిఆర్‌ఎస్‌ను ఢీ కొట్టాలంటే పార్టీ బలంగా ఉండాలని ఆశించకుండా..కేవలం ప్రకటనలకే పరిమితమయ్యే నాయకులకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పి చేజేతులారా పార్టీ అవకాశాలకు గండి కొట్టారు.

ఇక కేరళలో వామపక్షాలతో నిత్య శతృత్వం పెంచుకుని ఆ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేశారు. దేవుడి రాష్ట్రంగా పేరొందిన‌ కేరళ ఇప్పుడు హత్యలతో అట్టుడుకుతుంది.

ఈ హత్యలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌లే కారణం…అదే సమయంలో కమ్యూనిస్టులూ దీనికి ఆజ్యం పోస్తున్నా..మొత్తం బాధ్యత మాత్రం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానిదే. ఇక్కడ తమకు ఉన్న ఓటు బ్యాంక్‌ను నిలబెట్టుకుని బలమైన శక్తిగా మారాలన్న ఆరాటమే బిజెపి కొంప ముంచింది.

ఒరిస్సాలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించింది. ఈ ధీమాతోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే పీఠం అని గట్టిగా నొక్కి వక్కాణిస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్నాయక్‌ తన తీరు మార్చుకుని ప్రజలను మళ్లీ దరి చేర్చుకుంటున్నారు.

ప్రస్తుతం ఆయన తాను చేసిన తప్పులను సవరించుకుంటూ బిజెపికి మళ్లీ సవాల్‌ విసిరే పరిస్థితికి చేరుకున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలను ఇక్కట్లకు గురిచేసిన నోట్లరద్దు, జిఎస్‌టిల ప్రభావం ఈ రాష్ట్ర ప్రజలపై కూడా ఉంది.

కేంద్రంలో గత నాలుగేళ్ల నుంచి ఉన్న బిజెపి ప్రభుత్వం తమను ఉద్దరించిందేమీ లేదనే అభిప్రాయం ఇక్కడా వ్యక్తం అవుతుంది. ‘మోడీ’పై ఉన్న వ్యతిరేకత ‘పట్నాయక్‌’కు కలిసివస్తుందనడంలో సందేహం లేదు. అయితే కొద్దో గొప్పో సీట్లు ఇక్కడ బిజెపి సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంది.

దక్షిణాదిలో మరో ప్రముఖ రాష్ట్రమైన కర్ణాటకలో బిజెపి పరిస్థితి మొన్నటి దాకా ఆశాజనకంగానే ఉంది. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉంది. రాష్ట్ర పాలకులు అవినీతిలో మునిగిపోయారని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్దిరామయ్య వ్యవహారశైలిపైనా, ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపైనా ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో వారు బిజెపికి కూడా పెద్దగా మద్దతు ఇవ్వడం లేదు. కాంగ్రెస్‌ నేతల కన్నా బిజెపి నేతలే ఎక్కువ అవినీతి పరులని వారి అభిప్రాయం. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, గాలిజనార్ధన్‌రెడ్డి వంటి నేతలనువారు ఈసందర్భంగా ఉదాహరిస్తున్నారు.

అయితే గత ఐదు సంవత్సరాల ప్రజావ్యతిరేక పాలన తమను అధికారంలో కూర్చోబెడుతుందని బిజెపి నేతలు ఆనందపడుతున్నారు. అయితే వారు ఆనందపడే అంత పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే ఒక వైపు జాతీయస్థాయిలో ‘మోడీ’ ప్రభ క్షీణిస్తుండడం..అదే సమయంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు ‘రాహుల్‌గాంధీ’ పుంజుకోవడం..బిజెపి శ్రేణుల్లో కలవరానికి గురి చేస్తుంది.

ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు కర్ణాటక వశం అవుతుందని భావిస్తున్న బిజెపికి నిజంగా ఇది ఎదురుదెబ్బే. మొత్తం మీద దక్షిణాదిలోని ఆరు రాష్ట్రాల్లో బలంగా ఎదుగుదామని..అంతులేని ఆశతో అడుగులేసిన బిజెపి రోజు రోజుకు పతనం అంచున పరుగులు తీస్తుంది. ఈ పతనాన్ని ఆపడం మోడీ,అమిత్‌షా వల్ల అయ్యే పనికాదనడంలో ఎటువంటి సందేహాలు లేవు.

Leave a comment