Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

కృష్ణానదిలో తిరగబడిన బోటు

Published on Nov 13 2017 // News

కార్తీక మాసం… చివరి ఆదివారం రోజున విజయవాడకు విహార యాత్రకు వచ్చిన ఒంగోలు వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు బాధితులుగా మారారు.. అనుమతిలేని బోటు… అనువుకాని, తమకు అనుమతించని మార్గంలో వెళ్తూ ఇంత దారుణానికి కారణమైంది. పవిత్ర సంగమం వద్ద ఒండ్రు మట్టి మేటను ఢీకొట్టి తలకిందులైంది.


పవిత్ర సంగమం వద్ద తిరగబడిన బోటు
16 మంది మృతి. ఏడుగురు గల్లంతు
ఆస్పత్రుల్లో మరో 9 మంది
మృతులు ఒంగోలు వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు
బాధితుల్లో నెల్లూరుకు చెందిన మరికొందరు
బోటులో పవిత్ర సంగమానికి ప్రయాణం
అనుమతిలేకున్నా తిరిగిన ప్రైవేటు బోటు
ఒండ్రుమట్టి మేటను ఢీకొని పల్టీకొట్టిన బోటు
అచ్చోసిన నిర్లక్ష్యం..
లైఫ్‌ జాకెట్లు ఉన్నా ఇవ్వలేదు
‘ట్రయల్స్‌’ లేకుండా నేరుగా నీటిలోకి
అనధికార బోటు… అక్రమ మార్గం
ఏపీటీడీసీ అధికారుల ‘సొంత’ సంస్థ
నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారుల నిర్లక్ష్యం… కాసుల కోసం బోటు యాజమాన్యం కక్కుర్తి… కనీస భద్రతా ప్రమాణాలు పట్టించుకోని సిబ్బంది… ఏ దారిలో నడపాలో తెలియకుండానే బయల్దేరిన బోటు డ్రైవర్‌! అన్ని పాపాలూ కలిశాయి.

16 మంది ప్రాణాలను తీశాయి. విజయవాడ శివార్లలోని ఇబ్రహీపట్నం పవిత్ర సంగమం వద్ద… ఘోర ప్రమాదం జరిగింది. బాధితుల్లో అత్యధికులు ఒంగోలుకు చెందిన ‘వాకర్స్‌ క్లబ్‌’ సభ్యులు. మరికొందరు… నెల్లూరు జిల్లాకు చెందిన వారు. ఇంత ఘోరం ఎలా జరిగిందంటే…

విహార యాత్రకు బయల్దేరి…
ఒంగోలుకు చెందిన ‘ది ఒంగోలు వాకర్స్‌ క్లబ్‌’ సభ్యులు ప్రతి ఏటా కార్తీక మాసంలో విహార యాత్రకు వెళుతుంటారు. ఈసారి కార్తీక మాసంలో చివరి ఆదివారం రోజున ఒంగోలు నుంచి 40 మంది ఒక బస్సులో, 20 మంది మరో మినీ బస్సులో బయలుదేరారు.

అమరావతిలో అమరలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. విజయవాడ చేరుకుని కనకదుర్గమ్మ గుడికి వెళ్లారు. అక్కడి నుంచి పున్నమి ఘాట్‌కు చేరుకున్నారు. సాయంత్రం 4 తర్వాత… పున్నమి ఘాట్‌ నుంచి భవానీ ద్వీపానికి వెళ్లాలని భావించారు.

అయితే, అప్పటికే సమయం ముగిసిందని పర్యాటక శాఖ బోటు సిబ్బంది చెప్పారు. దీంతో అక్కడే ఉన్న ‘రివర్‌ బోటింగ్‌’ సంస్థకు చెందిన బోటు నిర్వాహకులను సంప్రదించారు. ఒక్కొక్కరికి రూ.300 ఇస్తే తీసుకెళతానని వాళ్లు చెప్పారు. అందుకు పర్యాటకులు సరే అన్నారు. సాయంత్రం 4.25 గంటలకు వారు భవానీ ద్వీపం చేరుకునే సరికి… అది మూసేసి ఉంది. ఇక ఒంగోలుకు తిరిగి బయలుదేరదామని నిర్వాహకులు ప్రతిపాదించారు.

అయితే… సమీపంలోనే ఉన్న పవిత్ర సంగమం దర్శిద్దామని కొందరు ప్రతిపాదించారు. సమయం సరిపోదని నిర్వాహకులు చెప్పినప్పటికీ… ‘ఇలా వెళ్లి అలా వచ్చేద్దాం’ అని పట్టుపట్టారు. ఒంగోలుకు చెందిన 32 మంది, నెల్లూరువాసులు మరో ఆరుగురు… మొత్తం 38 మంది అదే బోటులో పవిత్ర సంగమం వద్దకు బయలుదేరారు.

ప్రమాదం ముంచుకొచ్చింది..
పవిత్ర సంగమం… పట్టిసీమ నుంచి ఎత్తిపోసే గోదావరీ జలాలు కృష్ణా నదిలో సంగమించే చోటు! ఈ ప్రాంతాన్ని దాటుకుని హారతులు ఇచ్చే ప్రదేశానికి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో… ఆ ప్రాంతంలో ఒండ్రు మట్టి గట్టిగా మేట వేసింది. కృష్ణా నదిని బలంగా చీల్చుకుంటూ వచ్చే గోదావరి కలిసే ఆ ప్రాంతమంతా నీటి సుడులతో ఒకవిధమైన అలజడి కనిపిస్తుంది. ఒండ్రు మట్టి మేటను బోటు డ్రైవరు గుర్తించలేకపోయాడు. అడ్డంగా తోసుకు వచ్చే ప్రవాహాన్ని కూడా అంచనా వేయలేకపోయాడు.

ఎందుకంటే.. ఆ మార్గంలో అతను బోటు నడపడం అదే మొదటిసారి. మేట వేసిన ఒండ్రుమట్టిని బోటు కింది భాగం తాకి ఒక్కసారిగా కుదుపులకు గురైంది. పర్యాటకులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. కుదుపుల దాటికి… వారు కూర్చున్న కుర్చీలన్నీ కదిలిపోయాయి. దాదాపు అందరూ బోటులో ఒకేవైపునకు పడిపోయారు. ఏదో జరుగుతోందనే కంగారులో బోటు డ్రైవర్‌ వేగాన్ని మరింత పెంచాడు.

అది పరిస్థితిని మరింత ప్రమాదకరం చేసింది. అడ్డంగా తోసుకొస్తున్న గోదావరి నీరు బోటును తలకిందులు చేసేసింది. గంటపాటు సాగిన ప్రయాణం… మరో రెండు నిమిషాల్లో పవిత్ర సంగమం వద్దకు చేరుకుంటామనగా… సరిగ్గా సాయంత్రం 5.25 గంటలకు పెను విషాదంగా ముగిసింది.

స్పందించిన స్థానికులు
ప్రమాదాన్ని గుర్తించిన స్థానిక జాలర్లు ‘బోటు తిరగబడింది రండి’ అని గట్టిగా కేకలు వేశారు. ఒడ్డువద్ద ఉన్న కొందరు మరో నాలుగు బోట్లతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. జాలర్లు 8 మందిని రక్షించారు. అక్కడే ఉన్న బోటింగ్‌ సిబ్బంది మరో ఆరుగురిని నీటిలోనుంచి బయటకులాగి ఒడ్డుకు చేర్చారు.

మృతుల్లో తొమ్మిది మంది మహిళలున్నారు. ఏడుగురి ఆచూకీ గల్లంతు కాగా… 9 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పర్యాటకుల ప్రాణాన్ని బలికొన్న ‘రివర్‌ బోటింగ్‌’ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్‌ సూరిబాబు, సహాయకులు భైరవ స్వామి, హరిబాబు… ప్రమాదం తర్వాత పరారయ్యారు.

మృతులు వీరే…
1. రాయపాటి సుబ్రహ్మణ్యం (60) 2. పసుపులేటి సీతారామయ్య (64)
3. కె.ఆంజనేయులు (58) 4. కోవూరి లలిత (35) 5. వెంకటేశ్వరరావు (48)
6. రాజేశ్‌ (49) 7. హేమలత (49) 8. దాచర్ల భారతి (60) 9. కోటిరెడ్డి (45)
10. ప్రభాకర్‌రెడ్డి (50) 11. అంజమ్మ (55) 12. వె న్నెల సుజాత (40)
13. గుర్నాధరావు 14. కోవూరి వెంకటేశ్వరరావు(40) 15. సాయిన కోటేశ్వరరావు
16. సాయిన వెంకాయమ్మ

గల్లంతైంది వీరే…
1. వె న్నెల రమణమ్మ 2. కారుదారు ఉషారాణి 3. గాజర్ల శివన్నారాయణ
4. పోల కోటేశ్వరరావు 5. పోల వెంకాయమ్మ 6. బిందుశ్రీ
7. కూరపాటి నారాయణరాజు
మరో రెండు నిమిషాలు..
కృష్ణమ్మ అలలపై అలా.. అలా.. ముందుకు సాగుతున్న బోటు.. నదికి ఇరువైపులా ఉన్న ప్రకృతి అందాలను చూస్తూ తన్మయత్వంలో మునిగిన పర్యాటకులు.. ఇంతలోనే మట్టిమేట రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు. 2 నిమిషాల్లో క్షేమంగా ఒడ్డుకు చేరాల్సిన కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ విషాదఘటనతో పవిత్రసంగమంలో జరగాల్సిన నవహారతులు నిలిచిపోయాయి. కార్తీకమాసం, అందులోను ఆదివారం కావడంతో హారతులను తిలకించేందుకు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా వందలాది కుటుంబాలు పవిత్రసంగమానికి చేరుకున్నాయి. హారతి ఏర్పాట్లు జరుగుతుండగానే బోటు తిరగబడడం, అందులో నుంచి కొంతమంది బయటకు రావడం, మరి కొందరు గల్లంతవడంతో నవహారతులను నిలిపివేశారు.

అనుమతి లేకున్నా..
‘పవిత్ర సంగమం వద్దకూ తీసుకెళ్లాలి’ అని పర్యాటకులు అనగానే… బోటు సిబ్బంది ‘సై’ అన్నారు. నిజానికి… వారికి ఆ మార్గంలో బోటు తిప్పేందుకు అనుమతి లేదు.

అన్నింటికంటే దారుణమేమిటంటే… ఇప్పటిదాకా ఆ బోటు ఆ మార్గంలో ఒక్కసారి కూడా ప్రయాణించలేదు. కనీసం… డ్రైవరుకైనా ఆ దారిలో ఇతర బోట్లను నడిపిన అనుభవముందా అంటే అదీ లేదు. ప్రమాదకరమని తెలిసినా… కాసుల కోసం కక్కుర్తి పడ్డారు.

చివరన కూర్చోని బతికిపోయాం
బోటులో మేము చివరన కూర్చోవడంతో బతికిపోయామని ప్రకాశం జిల్లా ఇంకొల్లుకు చెందిన వాకర్స్‌ క్లబ్‌ సభ్యుడు వెంకటేశ్వరరావు తెలిపారు. ‘కొద్ది క్షణాల్లో ఘాటుకు చేరుకుంటామనగా బోటు ఒక్కసారిగా ఊగి అదుపుతప్పి తిరగబడిపోయింది. బోటు చివరలో ఉన్న నేను, నా భార్య బోటుపైన కడ్డీ పట్టుకున్నాం. బోటు బోల్తా పడిన తర్వాత కడ్డీ పట్టుకుని బోటుపైకి వచ్చాం.

అరగంటలోపు సహాయ సిబ్బంది వచ్చి మమ్మల్ని కాపాడారు. బోటు మధ్యలో కూర్చోని ఉంటే మేము కూడా చనిపోయే వారం. మా పిన్ని, బాబాయ్‌ కూడా బోటులో ఉన్నారు.

వారి పరిస్థితి విషమంగా ఉంది. లైఫ్‌ జాకెట్లు అడిగాం. ఈ బోటుకు లైప్‌ జాకెట్లు అవసరం లేదని చెప్పారు.’ అని వెంకటేశ్వరరావు ప్రమాద ఘటనను వివరించారు. – వెంకటేశ్వరరావు, ప్రకాశం జిల్లా

బోటు అటువైపు వెళ్లకూడదు
రూట్‌ మ్యాప్‌ ప్రకారం బోటు ప్రమాదం జరిగిన ప్రాంతం వైపు వెళ్లకూడదని సింపుల్‌ వాటర్‌స్పోర్ట్స్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ప్రమాదం జరిగిన సమయంలో బోటు డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి గతంలో ఎప్పుడూ ఇటు వైపు బోటు నడపలేదని చెప్పారు. రెండు నదుల నీళ్ల కలయిక వద్ద ఒరవడి ఎక్కువగా ఉంటుందని, బోటు మట్టిదిబ్బను గుద్దుకుని అదుపు తప్పిందని వివరించారు. ప్రమాదం నుంచి నలుగురిని తాము కాపాడగలిగామన్నారు. – సింపుల్‌ వాటర్‌స్పోర్ట్సు ప్రతినిధి

బోటుకు అనుమతి లేదు
ప్రమాదానికి గురైన బోటు ఇక్కడ తిరిగేందుకు అనుమతి లేదని విజయవాడ సిటీ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ తెలిపారు. బోటుకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేదని, మొత్తం 32 నుంచి 35 మంది బోటులో ప్రయాణించారని భావిస్తున్నామన్నారు. 16 మందిని సహాయ సిబ్బంది కాపాడరని చెప్పారు. – గౌతం సవాంగ్‌, సిటీ పోలీసు కమిషనర్‌

ముగ్గుర్ని కాపాడా: గోవిందరాజు
జి.కొండూరు:
‘ప్రమాదం జరగగానే సుమారు 10 మంది మత్స్యకారులం అక్కడకు చేరుకున్నాం. తిరగబడిన బోటు అడుగు భాగాన్ని పొడిచి ముగ్గుర్ని కాపాడాం.

గోదావరి జలప్రవాహానికి ఇసుకమేట వేయడాన్ని అలాగే నీటి వేగాన్ని పసిగట్టలేని బోటు డ్రైవర్‌ రాకూడని రూట్‌లో రావడంతో ఈప్రమాదం జరిగింది. మేము ముగ్గుర్ని కాపాడిన తర్వాత టూరిజం వారు వచ్చి బోటును తిప్పమనడంతో తిప్పాం.

దీంతో మరో నలుగురు గల్లంతయ్యారు. లేకుంటే మరికొంత మందిని కాపాడే వాళ్లం. ప్రమాదంలో నీళ్లు తాగిన వారికి సకాలంలో చికిత్స అంది ఉంటే తప్పకుండా మరికొంత మంది బతికే వారు.’ అని మత్స్యకారుడైన గోవిందరాజులు చెప్పారు.

Leave a comment