Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

ప్ర‌కంప‌న‌ల వెనుక ‘అర్జున్‌ రెడ్డి’ విజయం

Published on Sep 09 2017 // Movie News

ఈమధ్య కాలంలో ‘అర్జున్‌ రెడ్డి’ కోసం జరిగినంత చర్చ, రచ్చ ఇంకే సినిమాకీ జరగలేదేమో…! విడుదలకు ముందు తుపర్లు పడుతున్న వానలా కనిపించిన ‘అర్జున్‌రెడ్డి’ బొమ్మపడ్డాక సునామీలా విరుచుకుపడింది.

అది వసూళ్ల రూపంలో కావొచ్చు, విమర్శల రూపంలో కావొచ్చు, ప్రశంసల రూపంలో కావొచ్చు. ఈ వారం రోజులూ ‘అర్జున్‌రెడ్డి’ తప్ప మరో టాపిక్‌ కనిపించలేదు.. వినిపించలేదు చిత్రసీమలో. కొంతమంది మీడియాకెక్కి.. ‘ఇదేం సినిమా’ అని ప్రశ్నించారు. ఇంకొంతమంది ట్విట్టర్లలో ‘సినిమా అంటే ఇదే’ అన్నట్టు మెచ్చుకొన్నారు. ‘అర్జున్‌రెడ్డి’ని ‘క్లాసిక్‌’ అంటున్నారు కొందరు,

‘కాదు.. ఇదో ట్రెండ్‌ సెట్టర్‌’ అని నిర్వచిస్తున్నారు ఇంకొందరు. ఇవేం కాదు.. ‘ఇదో బూతు సినిమా, దీన్ని నిషేధించాల్సిందే’ అనే రీతిలో నిరసన గళం వినిపిస్తున్నారు మరికొందరు! ఓ సినిమా గురించి ఇన్ని భిన్నవాదనలు కూడా.. బహుశా ఇదే తొలిసారేమో. తెలుగు సినిమా అభిమానులు రెండుగా చీలిపోయి… ఓ వర్గం ‘అర్జున్‌రెడ్డి’ని వెనకేసుకొని వస్తుంటే, మరో వర్గం విమర్శనా బాణాల్ని ఎక్కిపెడుతోంది.

ఇవన్నీ పక్కన పెట్టి వసూళ్ల పరంగా ‘అర్జున్‌రెడ్డి’ ఈ యేటి మేటి చిత్రాల్లో ఒకటి. మిగిలిన విషయాల మాటేంటి?? ‘అర్జున్‌రెడ్డి’కి తెలుగు చిత్రసీమలో ఇవ్వదగిన స్థానమేంటి? అనే విషయాలు లోతుగా ఆలోచిస్తే… దర్శకుడు సందీప్‌ రెడ్డి… పక్కా క్లాస్‌ సినిమా ఏం తీయలేదు. పరమ పవిత్రమైన సినిమా అని చెప్పలేం. ‘ఇంటిల్లిపాదీ’ మెచ్చే కథ కాదాయె! ఇందులో బూతు వినిపిస్తుంది. లెక్కకుమించి ముద్దులు కనిపిస్తాయి. సెక్స్‌ ఉంది.

ఇంకా చాలా చాలా మసాలా సంగతులు ఉన్నాయి. దానికి తగ్గట్టే సెన్సార్‌ కూడా ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇచ్చింది. కాకపోతే.. ‘మంచి సినిమా’కి ఉండాల్సిన లక్షణాలూ కనిపిస్తాయి. తెలుగు సినిమాకి కొత్తకోణంలో చూపించే స్థాయి ‘అర్జున్‌రెడ్డి’కి ఉందన్నది విమర్శకుల మాట. సినిమాటిక్‌ లక్షణాల్ని మూడు గంటల పాటు పక్కన పెట్టాలన్న దర్శకుడి ఆలోచనల్ని మెచ్చుకొని తీరాల్సిందే. తెరపై సినిమా చూస్తుంటే… ఇదో సినిమా, టికెట్‌ కొనుక్కొని సీట్లో కూర్చున్నాం, తెరపై ఎవరెవరో నటిస్తున్నారు.. అనే ఫీలింగ్‌ని కాసేపు మర్చిపోతాం. అంత మాయ చేశాడు.

‘ఎవడో అర్జున్‌ రెడ్డి అనేవాడున్నాడు.. వాడి కథ ఎదురింట్లోనో, పక్కింట్లోనో కూర్చుని చూస్తున్నాం’ అనిపించేలా కథ, కథనాలు రాసుకొన్నాడు దర్శకుడు. సినిమాల్లో సంభాషణలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్రాంధికం జాడ్యం వదిలి.. పంచ్‌ల చుట్టూ తెలుగు మాట చక్కర్లుకొడుతోంది. అలాంటి చోట.. అత్యంత సహజమైన సంభాషణలు పేర్చుకొన్నాడు దర్శకుడు.

అదీ.. జనాలకు నచ్చేలా. క్లోజప్‌లు, టాలీలు.. అనే సాధారణ ధర్మాల్ని కూడా గాలికి వదిలేసి.. ఓ చల్లగాలి అల్లరి చేస్తు ఇష్టం వచ్చినట్టు అటూ ఇటూ తచ్చాడుతున్నట్టు, కంటికి ఇబ్బంది కలిగించని విధంగా కెమెరా ఫ్రేమలుల్లో కథని బంధించాడు. ఇవన్నీ సినిమా ప్రేమికుల్ని అమితంగా కట్టిపడేసిన విషయాలు. కట్‌ చేస్తే వచ్చి పడిపోయే పాటని.. ‘కట్‌’ చేసి ఎక్కడికో విసిరేశాడు. ఈ సినిమాలో ఇన్ని లిప్‌లాక్కులున్నాయి, ఇన్ని డ్రగ్స్‌ సన్నివేశాలున్నాయి,

ఇన్ని మందు బాటిళ్లు వాడారు.. అని లెక్కలు వివరిస్తున్న వాళ్లంతా.. కథానాయికని పరిచయం చేస్తూ, బ్యాక్‌గ్రౌండ్‌లో అష్టలక్ష్మీ స్త్రోత్రాన్ని దర్శకుడు వాడుకొన్నాడన్న సంగతి మర్చిపోతున్నారు. కథానాయికని ఆ స్థాయిలో కథా నాయకుడు ­హించుకొంటున్నాడు, కథానాయికకు ఇచ్చే గౌరవం అదీ.. అనే విషయాన్ని విమర్శకులు విస్మరిస్తున్నారు. దర్శకుడి భావాలేంటన్నది చాలా సన్నివేశాల్లో బయటపడింది.

‘అర్జున్‌ రెడ్డి’ని మరోసారి నిశితంగా చూస్తే ఆ సంగతి అర్థమవుతుంది. ఇది ‘అర్జున్‌రెడ్డి’ జీవిత కథ. అతని ప్రేమ, కోపం, భావోద్వేగాలు, కోరికలు.. అన్నీ ఫ్రేమ్‌ టూ ఫ్రేమ్‌ పేర్చుకొంటూ వెళ్లాడు దర్శకుడు. సినిమాలో కథానాయకుడ్ని ఉదాత్తుడిగా, ఉత్తముడిగా, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా చూపించాలని ఒక్కసారీ అనుకోలేదు. కాబట్టే.. ఆ పాత్ర అంతగా జనానికి చేరువైేౖంది.

కొన్ని చోట్ల దర్శకుడు మరీ శ్రుతిమించాడేమో అనిపించడం సహజం. ఈ కథని కాస్త పద్ధతిగా చెప్పి ఉండొచ్చుగాక. అన్నిసార్లు పెదవెంగిలి పడడం కూడా నచ్చే విషయం కాదు. కానీ.. డోసు తగ్గించే ప్రయత్నం చేస్తే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేదేమో అనిపిస్తుంది.
సినిమా రూల్స్‌ని బ్రేక్‌ చేసి కొత్త పాఠాలు నేర్పేది ఏదైనా ట్రెండ్‌ సెట్టరే.

ఆ ప్రాతిపదికన సినీ విమర్శకులంతా.. అర్జున్‌ రెడ్డిని ట్రెండ్‌ సెట్టర్‌ జాబితాలో చేర్చారు. ఈతరం దర్శకులపై, రచయితలపై ‘అర్జున్‌రెడ్డి’ ప్రభావం కొంతకాలం ఉండడం తథ్యం. కథానాయకుడి పాత్ర రాసుకొనేటప్పుడో, అతని యాటిట్యూడ్‌ చూపించాల్సివచ్చినప్పుడో.. ‘అర్జున్‌ రెడ్డి’ని జ్ఞప్తికి చేసుకొంటారేమో! అయితే అర్జున్‌ రెడ్డి ప్రభావం పరోక్షంగా యువతపై పడే అవకాశాలున్నాయా?

వాళ్లని ‘అర్జున్‌ రెడ్డి’ తప్పుదోవ పట్టిస్తుందా? అనే చర్చ కూడా సీరియెస్‌గానే సాగుతోంది. ఓ సినిమా జనాలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది? అనేది ఇప్పటి ప్రశ్న కాదు. సినిమా పుట్టినప్పటి నుంచీ ఉంది. అది సినిమా చూసేవాళ్ల దృక్కోణం, వాళ్ల అభిరుచులు, పుట్టి పెరిగిన పరిస్థితులపై ఉంటుందన్నది దర్శకుల మాట. కథానాయకుడ్ని తాగుబోతుగా చూపిస్తే… ఆ ప్రభావం సదరు కథానాయకుడ్ని అభిమానించే వాళ్లపై తప్పకుండా పడుతుందని విమర్శకులు వాదిస్తుంటారు. అలాగైతే ప్రతీ కథానాయకుడూ తెరపై తాగుబోతుగా నటించినవాడే కదా?

ఆయా అభిమానులంతా ఆ దారిలో నడుస్తున్నారని చెప్పగలరా?
‘శంకరాభరణం’ చూసి చాలామంది సంగీతంపై మక్కువ పెంచుకొన్నారేమో. లక్షలమంది ప్రేక్షకుల్లో ఒకరిద్దరు శాస్త్రీయ సంగీతం నేర్చుకొని, ఆలపించే స్థాయికి ఎదిగారేమో. మిగిలినవాళ్లంతా కచ్చేరీలకు సిద్ధమైపోలేదు కదా?

‘సాగర సంగమం’ విడుదలైన తరవాత డాన్స్‌ స్కూల్స్‌ ఏమీ పెరిగిపోలేదు కదా? సినిమా ప్రభావం ఏంటో ఈ రెండు సినిమాలు, వాటి ఫలితాలు, అందులోంచి పుట్టుకొచ్చిన మార్పుని చూస్తే అర్థమైపోతుంది. వంద సినిమాలు తయారైతే అందులో 90 శాతం సినిమాలు మంచే చెప్పాయి. మరి ఇంకా సమాజంలో కుళ్లు, కుతంత్రాలు, అన్యాయాలు ఎందుకున్నాయి? ‘భారతీయుడు’, ‘ఠాగూర్‌’ చూసిన తరవాత కూడా లంచాలు, అవినీతి ఉందంటే.. సినిమా తీసుకొచ్చిన

మార్పు ఎంతో, అది ఏపాటిదో తెలుస్తూనే ఉంది కదా?
‘అర్జున్‌ రెడ్డి’లాంటి సినిమాల వల్ల యువత పాడైపోతోందనుకోవడం అపోహే. మార్పు ఉంటే గింటే.. సినిమా చూసే విధానంలో, తీసే విధానంలో ఉండొచ్చు. ‘అర్జున్‌ రెడ్డి’ రాబోయే తరానికి గీటురాయి కాకపోవొచ్చు. కాకపోతే.. ‘ఇలాక్కూడా ఆలోచించొచ్చు’, ‘ఇలా తీసినా ప్రేక్షకుల్ని సంతృప్తి పర్చొచ్చు’ అనే భరోసాని మాత్రం కల్పిస్తుంది.

‘అర్జున్‌ రెడ్డి’ క్లాసిక్కా, ట్రెండ్‌ సెట్టరా? అనేది మర్చిపోండి. నాలుగు కోట్లతో సినిమా తీస్తే.. నిర్మాతలకు రూ.40 కోట్లు తెచ్చిపెడుతోంది. ఈ సినిమా ఆడుతున్న థియేటర్లన్నీ కళకళలాడిపోతున్నాయి. ఓ చిన్న హీరో, చిన్న దదర్శకుడు తీసిన చిన్న సినిమా… వసూళ్ల పరంగా కొత్త సంచలనాలకు తెర లేపుతోంది. ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది?? తెలుగు సినిమాకి కావల్సింది ఇలాంటి విజయాలే కదా??

Leave a comment